ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (17:47 IST)

జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేసీఆర్ కోవర్ట్‌లా..? వీహెచ్ ఫైర్

ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్‌పై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని తెలంగాణాలో కాదని ఆయన విమర్శించారు.
 
సాగర్‌ ఉప ఎన్నికలలో జానారెడ్డి ఓడిపోతాడు అని చెప్పడానికి జేసీ ఎవడని ఆయన ప్రశ్నించారు. జేసీ జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని వీహెచ్ మండిపడ్డారు. ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేసీఆర్ కోవర్ట్ అని అర్థమవుతోందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. జేసీ తన రాజకీయ బలాన్ని జగన్ పైన చూపుకోవాలని ఆయన సూచించారు. జేసీ దమ్మున్న లీడర్ అయితే అనంతపూర్‌లో లేదా రాయలసీమలో తన బలాన్ని చూపించుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
 
అలాగే భట్టి, జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిపై అధిష్టానానికి కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ పై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోనియా, రాహుల్‌ను జేసీ తిట్టిపోసినా ఈ నేతలు అడ్డుకోలేదని విమర్శించారు. జానారెడ్డి ఓడిపోతాడని జేసీ చెప్పినా స్పందించరా అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
"తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. వేరే దారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ అక్కడా ఇక్కడా లేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లింది. సాగర్‌లో జానారెడ్డి గెలువలేడు" అని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.