గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (10:09 IST)

సోనియా నమ్మినబంటు ఇకలేరు.. ఆంధ్రను ముక్కలు చేయడంలో కీలకపాత్ర!

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి నమ్మినబంటుగా, అత్యంత విశ్వాసపాత్రుడుగా గుర్తింపుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన అహ్మద్ పటేల్ ఇకలేరు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో తిరిగి కోలుకోలేక, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఆయన మరణవార్త తెలియగానే సోనియా గాంధీ తీవ్ర తిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఓ సంతాప సందేశాన్ని వెల్లడించింది. తనకు నమ్మిన బంటులా ఉంటూ, పార్టీ కష్టాల్లో పడిన వేళ తన చతురతతో సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించే అహ్మద్ పటేల్ మరణ వార్త తనను ఎంతో కలచి వేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. అహ్మద్ పటేల్‌ను తలచుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
 
తాను అత్యంత విశ్వాసపాత్రుడైన మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆమె అన్నారు. అహ్మద్ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. 
 
అంకితభావానికి, విశ్వాసానికి మారుపేరైన ఆయన, తనకు అప్పగించిన ఏ కర్తవ్యాన్ని అయినా నిబద్ధతతో నెరవేర్చేవారని, ఇతరులకు సాయపడటంలో అందరికన్నా ముందుంటారని సోనియా వ్యాఖ్యానించారు. అహ్మద్‌కు ఉన్న దయాగుణమే ఇతరులతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిపిందని అన్నారు. 
 
అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో ఆయన కీలక పాత్రను పోషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణాను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో ఈయన తనవంతు పాత్రను పోషించారు. అహ్మద్ పటేల్‌తో పాటు.. సుశీల్ కుమార్ షిండే, పి. చిదంబరం, జైరాం రమేష్ వంటి నేతలు కూడా ఉన్నారు.