జైలులో లారెన్స్ బిష్ణోయ్ - ఒక యేడాదికి ఖర్చు రూ.40 లక్షలు
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయినప్పటికీ ఆయన అవసరాల కోసం యేడాదికి రూ.40 లక్షల మేరకు అతని కుటుంబ సభ్యులు ఖర్చు చేస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. ఇదే అంశంపై ఆయన కుటుంబ సభ్యుడు రమేష్ బిష్ణోయ్ స్పందిస్తూ, లారెన్స్ జైలులో ఉన్నప్పటికీ అతడి అవసరాల కోసం కుటుంబ సభ్యులు యేడాదికి రూ.40 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
తమది తొలి నుంచి సంపన్న కుటుంబమేనని రమేశ్ తెలిపారు. లారెన్స్ తండ్రి హర్యానా పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసినట్టు పేర్కొన్నారు. వారికి తమ గ్రామంలో 110 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యను పూర్తిచేసిన లారెన్స్ గ్యాంగ్‌స్టర్ మారతాడని తాము ఊహించలేదన్నారు. అతడెప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించేవాడని గుర్తుచేసుకున్నారు.
బిష్ణోయ్ అసలు పేరు బాల్కరన్ బ్రార్. పాఠశాలలో చదువుతున్న సమయంలో తన పేరును లారెన్స్ బిష్ణోయ్‌గా మార్చుకున్నాడు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలోనే లారెన్స్ చెడు బాట పట్టాడు. డీవీఏ కాలేజీ గ్యాంగ్ వార్‌లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేయడంతో పూర్తిగా నేరాల బాట పట్టాడు.
అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నడంతో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. లారెన్స్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. సింగర్ సిద్దూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీపై దాడులకు అక్కడి నుంచే ప్లాన్ చేసి హతమార్చాడు. దీంతో లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోమారు పతాక శీర్షికల్లో మార్మోగిపోతుంది.