మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (17:17 IST)

లాక్ డౌన్‌లో బైక్ రేస్: బెంగుళూరులో గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్(Video)

సిలికాన్ సిటీలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో బెంగళూరు సిటీ, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అనవసరంగా ఎవ్వరూ రోడ్ల మీదకు రాకూడాదని, వాహనాల్లో సంచరించరాదని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫ్లై ఓవర్లను మూసి వేశారు. అయితే బెంగళూరు సిటీలోనే అతి పెద్ద ఫ్లైఓవర్ అయిన ఎక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మాత్రం తెరచి ఉంచారు.
 
ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద నుంచే తమిళనాడుకు, మైసూరుకు వెళ్లే నైస్ రింగ్ రోడ్డు సైతం ఉండటంతో ఈ ఫ్లైఓవర్ తెరచి ఉంచారు. నిత్యం ఈ ఫ్లై ఓవర్ మీద వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో అత్యవసర పాస్‌లు, పోలీసు వాహనాలు, ఆరోగ్య శాఖ, అంబులెన్స్ వాహనాలు మాత్రమే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద సంచరించడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు.
 
అయితే ఈ ఫ్లై ఓవర్ మీద ఓ యువకుడు యమహా 1000 సీసీ బండి మీద గంటకు 300 కిలోమీటర్ల స్పీడ్‌తో బైక్ నడిపి ప్రాణాలతో చెలగాటం ఆడాడు. అంతేకాదు బావా.. నేను బాహుబలి బావ అంటూ బైక్ నడుపుతున్న సమయంలో తీసిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
వివరాల్లోకి వెళితే... బెంగళూరు సిటీలో నివాసం ఉంటున్న ఓ యువకుడు యమహా 1000 సీసీ బైక్ తీసుకుని సిల్క్ బోర్డు మీదుగా ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీదకు వెళ్లాడు. చేతిలో వాయువేగంతో పరిగెత్తే బైకు.. ఖాళీగా ఉండే విశాలమైన రోడ్లు. ఇంకేముందు ఒక్కసారిగా యువకుడికి ఎక్కడలేని ఊపు వచ్చేసింది. యాక్సిలేటర్‌ను పెంచి గంటకు 300 కిలోమీటర్లు స్పీడ్‌తో వాయువేగంతో ఫ్లై ఓవర్ మీద రైడ్ చేశాడు. ఆ స్పీడుకు యమహా బైక్ ఊగిపోయినా ఆ యువకుడు మాత్రం బైక్ వేగం తగ్గించలేదు.

 
అంతేకాదు ఆ సమయంలో బైక్‌లో ముందు భాగంలో స్పీడోమీటర్ ఉన్న ప్రాంతంలో మొబైల్ పెట్టి ఓ వీడియో తీశాడు. ఆ వీడియోలో బైక్ 299 కిలోమీటర్ల వేగంతో అటూఇటూ ఊగుతూ వెళుతున్న విషయం స్పష్టంగా వెలుగు చూసింది. నేను హీరో, బాహుబలి బావ, 300 కిలోమీటర్ల స్పీడ్‌తో బైక్ నడిపాను, గాల్లో తేలినట్టుంది. మీరు చూడండి అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఆ బాహుబలి రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు.