ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (15:33 IST)

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులకు లాతూర్ జడ్పీ షాక్

జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులకు మహారాష్ట్రలోని లాతూర్‌ జడ్పీ ఛైర్మన్‌ షాక్‌ ఇచ్చారు. ఉద్యోగుల వేతనాల్లోంచి 30 శాతం కోత విధించారు. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను పట్టించుకోని ఏడుగురు జిల్లా పరిషత్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించినట్టు జడ్పీ ఛైర్మన్‌ రాహుల్‌ బోంద్రే వెల్లడించారు. 
 
తమకు వచ్చిన 12 ఫిర్యాదుల్లో ఆరుగురు ఉపాధ్యాయులే ఉన్నారని ఆయన తెలిపారు. కోత విధించిన మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాల్లోకే బదిలీ చేసినట్టు చెప్పారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలన్న ప్రతిపాదనను గతేడాది నవంబర్‌లో జడ్పీ జనరల్‌ బాడీ ఆమోదించగా.. డిసెంబర్‌ నుంచి నెల జీతంలో కోత ప్రారంభమైందని ఆయన వివరించారు. 
 
ప్రతి నెలా వారి వేతనంలో 30శాతం కోత కొనసాగుతుందని, సగటున ఇది రూ.15 వేలు దాకా ఉంటుందని తెలిపారు. తాము నోటీసులు పంపిన తర్వాత కొన్ని కేసుల్లో ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు పరస్పరం సమస్యను పరిష్కరించుకున్నారని తెలిపారు.