సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (10:51 IST)

‘భారత రత్న’లు సచిన్‌ టెండూల్కర్‌, లతా మంగేష్కర్, ఇతర సెలబ్రిటీల ట్వీట్ల వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందా?: మహారాష్ట్ర దర్యాప్తు - ప్రెస్ రివ్యూ

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తూ భారత రత్నలు సచిన్‌ టెండూల్కర్‌, లతా మంగేష్కర్‌ సహా పలువురు సెలిబ్రిటీలు చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

 
ఆ కథనం ప్రకారం.. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పలువురు సెలిబ్రిటీలు ట్వీట్లు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని దేశ్‌ముఖ్‌ తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సచిన్‌ సావంత్‌ నేతృత్వంలోని బృందం ఈవిషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిందని ఆయన చెప్పారు.

 
మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా అమెరికన్‌ పాప్‌ స్టార్‌ రిహానా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ ఇటీవల ట్వీట్లు చేశారు. వాటిని వ్యతిరేకిస్తూ.. కేంద్ర ప్రభుత్వ చట్టాలను సంఘీభావం పలుకుతూ వివిధ రంగాలకు చెందిన పలువురు భారతీయ సెలిబ్రిటీలు ట్వీట్లు చేశారు. వీరిలో క్రికెటర్‌ సచిన్‌, గాయని లతా మంగేష్కర్‌, బాలీవుడ్‌ ప్రముఖులు అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఏక్తా కపూర్‌, సునీల్‌ శెట్టి, కరణ్‌ జోహర్‌, క్రికెటర్లు సురేశ్‌ రైనా, అనిల్‌ కుంబ్లే, ఆర్‌.పి.సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓఝా, విరాట్‌ కోహ్లీ తదితరులు ఉన్నారు.

 
‘‘ఈ ట్వీట్ల వెనుక బీజేపీ హస్తం ఉందా? చాలామంది సెలిబ్రిటీలు చేసిన ట్వీట్లలో ‘అమికబుల్‌’ తరహా ఒకే రకమైన ఆంగ్ల పదాలను ఎందుకు వాడారు?’’ అనేది దర్యాప్తులో తేలుతుందని సావంత్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా చేసిన ట్వీట్లన్నీ ఇంచుమించు ఒకే సమయంలో విడుదలయ్యాయని ఆయన గుర్తుచేశారు. దేశం గర్వించదగిన ఇలాంటి గొప్ప వ్యక్తులను ఒకవేళ బీజేపీ బెదిరించి ఉంటే.. వెంటనే వారికి రక్షణ కల్పించాలన్నారు.

 
అయితే.. ‘భారత రత్న’లపై దర్యాప్తు అనే పదాన్ని ప్రయోగించినందుకు రాష్ట్ర సర్కారు సిగ్గుపడాలని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ మండిపడ్డారు.