సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 నవంబరు 2018 (11:21 IST)

ఆడపులి మూత్రం.. ప్రత్యేక సెంటు ఎరతో... అవనిని కాల్చి చంపిన హైదరాబాదీ షూటర్

మనిషి రక్తానికి అలవాటు పడిన అవని పులిని ఆడపులి మూత్రం.. అమెరికా నుంచి ప్రత్యేకంగా తెచ్చిన సెంటును ఎరవేసి కాల్చి చంపేశారు. ఈ పులి గత యేడాది కాలంలో 13 మందిని చంపి ఆరగించింది. మహారాష్ట్రలోని రాలెగాం అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరిస్తూ వచ్చిన ఈ పులి.. చివరకు దాని కంట పడ్డ మనిషిని వెంటాడి.. వేటాడి చంపేసి ఆరగించేది. 
 
దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం 'కనిపిస్తే కాల్చివేత' ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది.. నరమాంసానికి అలవాటు పడిన ఆ పులిని చాలా పకడ్బందీగా మట్టుబెట్టారు. ఇందుకోసం వేరే ఆడపులి మూత్రం ఎరవేశారు. అమెరికా నుంచి తెచ్చిన ప్రత్యేక సెంటు జల్లారు. ఆ వాసనకు అటుగా వచ్చిన బెబ్బులిని ఓ పదునైన వేటగాడు కాల్చిపారేశాడు. జంతు-హక్కుల పరిరక్షణ కార్యకర్తలు ఈ చర్యపై నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజానీకం మాత్రం సంబరాలు చేసుకున్నారు.
 
ఈ బెంగాల్ జాతి పులి అయిన అవని వయసు ఆరేళ్లు. దీనికి తొమ్మిది నెలల వయసున్న రెండు పిల్లలున్నాయి. కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న మనిషిని కూడా అవని పసిగట్టి అటువైపు వచ్చేది. రాలెగాం సమీపంలోని 'తిప్పేశ్వర్‌ పులి సంరక్షణ ప్రాంతం'లోని గిరిజన గ్రామాల ప్రజలు అవనికి భయపడి, అడవిలోకి వెళ్లాలంటే జంకేవారు. తప్పనిసరి అయితే గుంపులుగా లేదా అగ్ని రగిల్చే సామగ్రితోనో వెళ్లేవారు. అయినా దాని నుంచి తప్పించుకోవడం కష్టమయ్యేది. ఒకరిద్దరు వన్యప్రాణి సంరక్షణ పరిశోధకులు సైతం దీని బారిన పడ్డారు.
 
దీన్ని మట్టుబెట్టేందుకు అటవీ సిబ్బంది నిర్ణయించారు. కానీ వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం వాటిని చంపరాదు. విషయం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. 'ఆఖరి అస్త్రంగా మాత్రమే చంపాలని, సాధ్యమైనంత వరకూ మత్తును కలిగించే ట్రాంక్విలైజర్‌ గన్స్‌తో నేలకూల్చి బంధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ రోజురోజుకూ అవని బెడద పెరుగుతుండటంతో.. మహారాష్ట్ర సర్కారు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను రద్దుచేయాలని ఎంతమంది కోరినా, రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదు. దాదాపు 150 మందితో ఓ భారీ బృందం రంగంలోకి దిగింది. 
 
ఈ బృందం ఈ పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, అక్టోబరు 25వ తేదీన భులాగడ్‌ ప్రాంతంలో ఓ రైతుపై ఆవని విఫలదాడి చేసింది. విషయం తెలుసుకున్న అధికారులు, దాన్ని ఉచ్చులోకి లాగేందుకు అన్నిరకాల ప్రయోగాలూ చేశారు. మొదట మేకపిల్లను ఎరవేసినా పులి చిక్కలేదు. తర్వాత మరో పులి తాలూకు మూత్రాన్ని జల్లారు. అమెరికా నుంచి తెచ్చిన సెంటును కూడా కొంతమేర జల్లారు. ఆ వాసనకు శుక్రవారం సాయంత్రం పులి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. వస్తూనే అలికిడి విని, ఓపెన్‌టాప్‌ జీప్‌లో ఉన్న అధికారులపై ఉరికింది. వెంటనే స్పందించిన అస్ఘర్‌అలీ పులిని దాదాపు 5 మీటర్ల దూరం నుంచి కాల్చారు. బుల్లెట్‌ తగిలిన పులి అక్కడికక్కడే మరణించింది.
 
అవనిపై కాల్పులు జరిపిన వ్యక్తి అస్ఘర్‌ అలీ ఖాన్‌.. దేశంలో పులుల వేటలో సిద్ధహస్తుడైన నవాబ్‌ షఫత్‌ అలీ కుమారుడు. హైదరాబాద్‌కు చెందిన షఫత్‌ ఓ సెలిబ్రిటీ. వీరి కుటుంబానిది తరతరాలుగా పులుల వేటలో అందె వేసిన చెయ్యి. నిజానికి షఫత్‌ను ఈ పనికి దింపుతున్నారని గతంలో వార్తలు వచ్చినపుడు నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆయనను ఉపసంహరించామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అస్ఘర్‌ అలీ ఓ ప్రైవేట్ హంటర్‌ హోదాలో ఈ ఆపరేషన్‌లో పాల్గొనడం వివాదం రేపింది.