శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 22 జూన్ 2019 (12:51 IST)

బీజేపీలో చేరగానే సచ్ఛీలురయ్యారా : మాయావతి ఎద్దేవా

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడం పట్ల బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. టీడీపీలో ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు అవినీతిపరులుగా కనిపించారనీ ఇపుడు బీజేపీలో చేరగానే వారంతా సచ్చీలురై పోయారంటూ ఎద్దేవా చేశారు. 
 
పైగా, బీజేపీ బ్రాండ్‌ రాజకీయాల్లో అన్నీ సరైనవేనని ఆమె అన్నారు. నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసుకోవడంపై శుక్రవారం ట్విట్టర్ స్పందిస్తూ, 'ప్రభుత్వం తరపున రాష్ట్రపతి గురువారమే హామీలిచ్చారు. కానీ అదేరోజు బీజేపీ నలుగురు టీడీపీ ఎంపీల ఫిరాయింపును రచించింది. ఆ నలుగురిలో ఇద్దరిని అవినీతిపరులుగా గతంలో అభివర్ణించింది. ఇప్పుడు ఆ పార్టీలో చేరగానే వారు పాల కంటే స్వచ్ఛంగా మారిపోయారు' అంటూ ఎద్దేవా చేశారు. 
 
కాగా, తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులు గురువారం బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. పైగా, రాజ్యసభలో టీడీపీపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు లేఖ కూడా ఇచ్చారు. ఈ విలీనంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.