ఎంపీలకు కరోనా పరీక్షలు... జీరో టచ్ సెక్యూరిటీ : లోక్‌సభ స్పీకర్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు ఒకటో తేదీ వరకు జరిగే ఈ సమావేశాలను రెండు షిప్టుల్లో నిర్వహించనున్నారు. అయితే, ఈ సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ సభ్యులందరికీ స్పీకర్ ఓం బిర్లా సూచించారు.
ఈ సమావేశాల ఏర్పాట్లలో భాగంగా, ఆయన శుక్రవారం ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు, డీఆర్డీవో అధికారులతో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, 'ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంస్థల నిర్వహణకు కోవిడ్-19 ప్రధాన సవాలు విసిరింది. కోవిడ్ సంబంధిత నియమ నిబంధనలను పాటించడం ద్వారా పార్లమెంటు సమావేశాలకు సభ్యులంతా సహకరిస్తారని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఎంపీలతో పాటు పార్లమెంటు ఆవరణలో ప్రవేశించే అధికారుల నుంచి మంత్రులు, మీడియా ప్రతినిధులు, లోక్‌సభ సిబ్బంది, రాజ్యసభ కార్యదర్శులంతా పార్లమెంట్ సమావేశాలకు ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, జీరో-టచ్ సెక్యూరిటీ తనిఖీల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.