మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (18:22 IST)

రాజధానిగా వైజాగ్.. ఏ శక్తీ అడ్డుకోలేదు... వెన్నుపోటు దినోత్సవం : విజయసాయి రెడ్డి

తమ పార్టీ అధినే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్టణం నవ్యాంధ్రకు కార్యనిర్వాహక రాజధాని అయి తీరుతుందనీ, దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు పునరుద్ఘాటించారు. 
 
విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సీఎం జగన్ సమక్షంలో శుక్రవారం వైకాపా కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ మద్దతు తెలుపుతున్నారన్నారు. 
 
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులపిచ్చి ఉన్న నేత.. కానీ, తమ పార్టీ అధినేత బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలతో పాటు.. మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా, తమ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును లోక్‌సభ స్పీకరు ఓం బిర్లా తక్షణం అనర్హుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అంతేకాకుండా, బషీర్‌బాగ్‌ కాల్పులు జరిగి 20 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో చంద్రబాబుకు విజయసాయి చురకలంటించారు. 'విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న ''వెన్నుపోటు'' దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్టు28 ''చంద్రన్న రక్తపాత దినోత్సవం'' జరుపుకుంటున్నారు. బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు.' అంటూ పేర్కొన్నారు.