సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (08:30 IST)

పెళ్లి పేరుతో వృద్ధుడికి ఆశ... రూ.కోటితో కి'లేడి' పరార్

పెళ్లి పేరుతో ఓ మహిళ ఒక వృద్ధుడిని మోసం చేసి, అతని వద్ద నుంచి కోటి రూపాయలతో పారిపోయింది. మోసపోయిన బాధితుడు ముంబయిలోని అంధేరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
 
ఈ కేసు గురించిన వివరాలను పోలీసులు వెల్లడిస్తూ, ముంబైలోని మలద్‌ ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల జెరాన్‌ డిసౌజా అనే వృద్ధుడు 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. 
 
2019లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. దానిపై వడ్డీ రూపంలో వచ్చిన మొత్తంలో కొంత నగదును ఉపసంహరించుకున్నాడు. అయితే, అదే బ్యాంక్‌లో పనిచేస్తున్న షాలిని ఈ విషయం పసిగట్టింది. జెరాన్‌ డిసౌజా ఉపసంహరించుకున్న డబ్బుపై కన్నేసిన షాలిని.. ఆ వృద్ధుడితో పరిచయం పెంచుకుంది. 
 
వృద్ధాప్యంలో తోడుగా ఉంటానని ఒట్టేసింది. వివాహం చేసుకుంటానని మాటిచ్చింది. దీంతో ఇద్దరు కలిసి రెస్టారెంట్లకు, షికార్లకు తిరిగారు. ఆ తర్వాత తనొక వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందులో పెట్టుబడి పెట్టాలని జెరాన్‌ను కోరింది. 
 
లాభాలు చెరి సగం తీసుకుందామని నమ్మబలికింది. కాబోయే భార్యే కదా అని పెట్టుబడి కింద రూ.1.3కోట్ల డబ్బును 2020 డిసెంబర్‌లో షాలిని బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. 
 
అంతే, నగదు తన అకౌంట్లో పడగానే షాలినీ తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకుంది. జెరాన్‌ ఆమెను కలుసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాడు. దీంతో మోసపోయాయని తెలుసుకున్నాడు. గత డిసెంబర్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు విచారణ జరుపుతున్నారు.