శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (17:29 IST)

పాక్ క్రికెట్ కెప్టెన్ బాబర్‌పై ఎఫ్ఐఆర్.. వాడుకుని గర్భవతిని చేశాడని..?

babar azam
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో లాహోర్‌లోని అదనపు సెషన్స్‌ కోర్టు బాబర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతేడాది చివరలో ఆజమ్‌పై లాహోర్‌కు చెందిన హమీజా ముక్తర్ అనే మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 
 
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా బాబర్ లైంగికంగా వాడుకుంటున్నాడని, గర్భవతిని కూడా చేశాడని ఆమె పేర్కొన్నారు. బాబర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను డబ్బు సాయం చేశానని కూడా చెప్పుకొచ్చారు. 
 
బాబర్‌ ఆజమ్ తనను పెళ్లాడతానని 2010లో ప్రపోజ్ చేశాడని హమీజా ముక్తర్ చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకున్నాడని, ఆ తర్వాత తనను వదిలించుకోవాలని చూశాడని, ఓ సారి తనకు బలవంతంగా అబార్షన్‌ కూడా చేయించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హమీజా‌ తరఫు న్యాయవాది ఇందుకు సంబంధించిన వైద్య పత్రాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు.
 
ఇరు వర్గాల వాదనలు విన్న అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయూర్తి నోమన్ ముహమ్మద్ నయీమ్ బాబర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా‌ నసీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు.
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు తీవ్రంగా, కలవరపరిచే విధంగా ఉన్నాయన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని గతంలో హమీజా ఆరోపించారు. 
 
మరోవైపు బాబర్‌ ఆజమ్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటే రూ.45లక్షలు భరణంగా ఇవ్వాలంటూ హమీజా ముక్తర్ ఇదివరకే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. బాబర్‌ తనకు భరణం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.