మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (17:38 IST)

రూ.20 లక్షల విలువ చేసే టమోటా లారీని హైజాక్‌ చేసిన దుండగులు

tomatos
దేశవ్యాప్తంగా టమోటాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో టమోటాలను చోరీ చేసే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఒకటి రెండు రాష్ట్రాల్లో ఏకంగా టమోటా రైతులను కూడా చంపేశారు. తాజాగా 20 లక్షల రూపాయల విలువ చేసే టమోటాలతో కూడిన లారీని కొందరు దుండగులు హైజాక్ చేశారు. 
 
కర్నాటక రాష్ట్రంలోని కోలార్ ఏపీఎంసీ యార్డ్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు రూ.20 లక్షల విలువ చేసే టమోటా లోడుతో బయలుదేరింది. ఈ లారీ మార్గమధ్యంలో కనిపించకుండా పోయింది. దీనిపై ట్రక్కు యజమాని కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు.. ఈ ట్రక్కును శనివారం రాత్రి జైపూర్‌కు చేరుకోవాల్సి వుంది. కానీ, డ్రైవర్ అక్కడకు వెళ్లకుండా స్విచాఫ్ ఆఫ్ చేశాడు. ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాన్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి.
 
కోలార్‌లో ఉన్న ఎస్వీటీ ట్రేడర్స్ యజమాని మునిరెడ్డి దుకాణం నుంచి 11 టన్నుల టమోటా లోడుతో ట్రక్కు జైపూర్‌కు బయలుదేరింది. శనివారం రాత్రి లారీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ టోల్ గేట్ దాటినట్లు మునిరెడ్డికి డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. ఆదివారం ఉదయం ట్రక్కు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఫోన్ చేయగా, నెంబర్ అందుబాటులో లేదని వచ్చింది. 
 
ట్రక్కు క్లీనర్ వద్ద మొబైల్ ఫోన్ లేదు. లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ నుండి కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో మునిరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. ట్రక్కు కోలార్ నుండి సుమారు 1,600 కి.మీ దూరం ప్రయాణించిన తర్వాత జాడ లేకుండా పోయింది. వాహనం ప్రమాదానికి గురైందా? ట్రక్కును హైజాక్ చేసి, దొంగిలించారా? మొబైల్ నెట్ వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫోన్ కలవడం లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.