ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (19:25 IST)

కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

కరోనాతో నెలకొన్న పరిస్థితులు మెరుగుపడటం, కొత్త కేసులు తగ్గుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన రాత్రి పూట కర్ఫ్యూని ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూకి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల గడువు అక్టోబర్‌ 25తో ముగిసింది. దీంతో గత 10 రోజులుగా రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ ఉందా? లేదా? అనే అంశంపై ప్రజల్లో అయోమయానికి తోడు అనేక ఊహాగానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులు వాటికి తెరదించాయి. అలాగే, రాష్ట్రంలో గుర్రపు పందేలు పునఃప్రారంభించుకొనేందుకు కూడా పలు నిబంధనలతో కూడిన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. గుర్రపు పందేలు నిర్వహించే ప్రదేశాల్లో సామర్థ్యానికి మించి జనం హాజరు కారాదని, అలాగే, వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారినే అనుమతించాలని సూచించింది.

మరోవైపు, గురువారం కర్ణాటకలో 261 కొత్త కేసులు నమోదు కాగా.. ఐదుగురు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 29,89,275కి చేరగా.. 38,095మంది మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ 8267 క్రియాశీల కేసులు ఉన్నాయి.