శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:55 IST)

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ ఎక్కడ? పోలీసు బృందాల గాలింపు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు కావడానికి ప్రధాన కారణం ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్‌లో ఇస్లాం ఆధ్యాత్మిక సమ్మేళనం అని తేలింది. ఈ సమ్మేళలానికి కరోనా బాధిత దేశాల నుంచి అనేక మంది ఇస్లాం మతపెద్దలు వచ్చారు. అలాగే, దేశంలోన పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ప్రతినిధులు ఈ మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. విదేశీ ప్రతినిధుల నుంచి వీరికి కరోనా సోకింది. ఆ తర్వాత వీరంతా తమతమ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ స్థానికులకు ఈ వైరస్ అంటించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించారని పేర్కొంటూ మర్కజ్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే, కరోనా వ్యాప్తికి కారణమయ్యారని మరో ఆరోపణపై కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా, ఈ కార్యక్రమంలో ఆయన లాక్‌డౌన్ పాటించనక్కర్లేదనీ, ప్రతి ఒక్కరూ సామూహిక ప్రార్థనలు చేయాలంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు ఓ ఆడియో ఒకటి రిలీజ్ అయింది. దీంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఈయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. సాద్‌ ఆచూకీ తెలిసుకునేందుకు ఆయన బంధువుల వద్ద కూడా విచారిస్తున్నారు. అంతేకాకుండా, ఇతర మసీదుల్లో సాద్ దాగివున్నాడన్న అనుమానంతో ఆ మసీదుల్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.