గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (10:47 IST)

ఇదీ నిజాముద్దీన్ మర్కజ్ చరిత్ర!

దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసులకు మూలం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మతపరమైన కార్యక్రమం అని తేలింది. ఇక్కడ నుంచే దేశంలోని పలు రాష్ట్రాలకు కరోనా వైరస్ వ్యాపించినట్టు తేలింది. ఈ మర్కజ్‌కు వెళ్లినవచ్చినవారిలో సింహం భాగం ఈ వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. ఒక్క మంగళవారమే తెలంగాణాలో 15, ఆంధ్రప్రదేశ్‌లో 33, తమిళనాడులో 45, ఢిల్లీలో 24 చొప్పున నమోదు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
 
వీరంతా మర్కజ్‌కు వెళ్లివచ్చినవారే. ఇక్కడ మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులే భారీగా వెలుగులోకి వచ్చాయి. ఇందుకు కారణం వేల సంఖ్యలో మర్కజ్‌కు వెళ్లడమే. అందుకే అక్కడికి వెళ్లిన అందరినీ గుర్తించే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడ్డాయి. 
 
అసలు మర్కజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇస్లాం మత సిద్ధాంతాలను, ప్రవచనాలను ప్రచారం చేసే సంస్థ తబ్లీగ్‌ జమాత్‌. దీనికి అనుబంధంగా ఎక్కడికక్కడ 'జమాత్'’లు ఉంటాయి. ఇందులో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. తమకు వీలైనంత మేరకు ఇరుగు పొరుగు గ్రామాలు, పక్క జిల్లాలకు కూడా వెళ్లి స్థానిక ముస్లింలను కలిసి ఇస్లాం సూత్రాలను వివరించి, వాటిని పాటించాలని కోరుతుంటారు. 
 
తబ్లీగ్‌ జమాత్‌ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్‌ ఏరియాలో ఉంది. దీనినే... 'నిజాముద్దీన్‌ మర్కజ్‌' అని పిలుస్తారు. ఇది సుమారుగా వందేళ్ల నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇక్కడ యేడాది పొడవునా మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమావేశాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు, సదస్సులకు దేశ విదేశాలకు చెందిన ముస్లిం ప్రతినిధులు హాజరై ప్రసంగిస్తుంటారు.