బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (14:01 IST)

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా కాటు... కానీ భారత్‌కు మాత్రం...

ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టేసింది. ఈ వైరస్ బారి నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ.. ఏ ఒక్క దేశం కృషి ఫలించడం లేదు. దీంతో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్యతో పాటు.. మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 
 
ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాటేసింది. కరోనా దెబ్బకు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దీంతో ప్రపంచం ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకొనే అవకాశముందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి 2.5 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీ అవసరముంటుందని అభిప్రాయపడింది. 
 
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కరోనా షాక్‌ పేరుతో ఐరాస ట్రేడ్ రిపోర్ట్ విడుదల చేసింది. అయితే, ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం భారత్, చైనాలకు మాత్రం ఉండకపోవచ్చని తెలిపింది. వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన అభివృద్ధి చెందుతోన్న దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
 
కరోనా వైరస్ కారణంగా ఈ యేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, ఈ నేపథ్యంలోనే దేశాలు మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని వివరించింది. ఐక్యరాజ్య సమితి తాజా వార్త కోట్ల మంది భారతీయులకు ఓ శుభవార్త వంటిదని చెప్పొచ్చు.