శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (08:17 IST)

ఆంధ్రాను వణికిస్తున్న కరోనా... ఒక్క రోజే పగో జిల్లాలో 14 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదుపులో ఉందని భావించిన కరోనా వైరస్ ఇపుడు విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా, ఢిల్లీలో జరిగిన మర్కజ్ అనే మతపరమైన కార్యక్రమానికి రాష్ట్రం నుంచి అనేక మంది వెళ్ళినట్టు తేలింది. వీరందరికీ వైరస్ సోకడమేకాకుండా, వీరి ద్వారా వీరి కుటుంబ సభ్యులకు కూడా సోకింది. దీంతో ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం ఒక్క రోజే ఏకంగా 14 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అధికారికంగా ప్రకటించారు. 
 
ఈ నమోదైన కరోనా కేసుల్లో ఏలూరులో 6, భీమవరం, పెనుగొండలలో చెరో రెండు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కో కేసు చొప్పు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. వీటితో కలిసి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58కి పెరిగింది. జిల్లాలో మొత్తం 30 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్, మరో 10 మందికి నెగటివ్ రిపోర్టులు వచ్చాయని, ఆరుగురికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.
 
అదేవిధంగా మర్కజ్‌లో పాల్గొన్న వారిలో విశాఖ జిల్లా వాసులు కూడా ఉన్నారు. వీరిలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, కరోనా పాజిటివ్ బాధితుల్లో ఇద్దరు వ్యక్తులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.