శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (19:11 IST)

ఎవరి వేతనాల్లో ఎంతెంత తగ్గింపు? జీవో జారీచేసిన టి సర్కారు

కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపట్టింది. అదేసమయంలో కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఖజానాపై ఆర్థిక భారం పడింది. పైగా, కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు వీలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో తగ్గింపు విధిస్తున్నారు. ఈ తగ్గించిన వేతనాన్ని భవిష్యత్తులో పరిస్థితి చక్కబడిన తర్వాత తిరిగి చెల్లిస్తారు. 
 
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్రంగా సమీక్ష జరిగింది. దీనికి సంబంధించిన జీఓ సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఎవరికి ఎంతెంత తగ్గింపు విధిస్తున్నారో ఓ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 
 
* ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం తగ్గించి ఇస్తారు. 
* ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం తగ్గించి ఇస్తారు. 
* మిగతా అన్ని క్యాటగిరీల ఉద్యోగులు, అన్ని రకాల రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం చొప్పున తగ్గింపు వుంటుంది. 
 
* నాలుగో తరగతి, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు, నాలుగో తరగతి రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం చొప్పున తగ్గింపు విధిస్తారు. 
 
* అంతేకాకుండా, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల  మాదిరిగానే వేతనాల్లో అంటే పది శాతం తగ్గింపు వుంటుందని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది.