శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (15:18 IST)

కపట క్షమాపణలు చెప్పలేను.. అది అంతరాత్మ ధిక్కారమే : ప్రశాంత్ భూషణ్

దేశ న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రముఖ సీనయిర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆయనకు సూచన చేసింది. ఇందుకోసం సోమవారం వరకు గడువు విధించింది. 
 
అయినప్పటికీ కోర్టుకు సారీ చెప్పేందుకు ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. కుటిల మ‌న‌స్త‌త్వంతో క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేన‌ని, అలా చేస్తే అది త‌న అంత‌రాత్మ ధిక్కారంతో ఆటు న్యాయ‌వ్య‌వ‌స్థ ఉల్లంఘ‌న కూడా అవుతుంద‌ని ప్ర‌శాంత్ భూష‌ణ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్ ఆగ‌స్టు 20వ తేదీన స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తానని ఆ రోజున చెప్పారు. 
 
అయితే తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశాంత్‌ భూషణ్‌కు రెండు రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.