నా ప్రాణ స్నేహితుడిని చాలా మిస్సవుతున్నా : ప్రధాని నరేంద్ర మోడీ

modi - yoga day
ఠాగూర్| Last Updated: సోమవారం, 24 ఆగస్టు 2020 (14:31 IST)
కేంద్ర మాజీ మంత్రి, బీజీపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ చనిపోయి సరిగ్గా ఒక యేడాది. దీంతో ఆయన ప్రథమ వర్థంతి వేడుకలు ఢిల్లీలో జరిగాయి. సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు.

'నా ప్రాణ స్నేహితుణ్ని చాలా మిస్సవుతున్నా' అంటూ సోమవారం ట్వీట్ చేశారు. 'గతేడాది సరిగ్గా ఈ రోజే అరుణ్ జైట్లీని కోల్పోయాం. నా ప్రాణ స్నేహితుణ్ని చాలా మిస్సవుతున్నా. జైట్లీ దేశానికి చాలా శ్రద్ధగా సేవ చేశారు. తెలివి తేటలు, చట్టపరమైన చతురత తదితర గుణాలు చాలా గొప్పవి' అంటూ మోడీ ట్వీట్ చేశారు. దీంతోపాటు అరుణ్ జైట్లీ విషయంలో ప్రధాని మోడీ మాట్లాడిన పాత వీడియోను మోడీ ట్విట్టర్‌లో జత చేశారు.

అలాగే, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అరుణ్ జైట్లీతో ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ఇదే అంశంపై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. నా స్నేహితుడు... అంటూ అరుణ్ జైట్లీ చిన్ననాటి ఫొటో పోస్టు చేశారు. నా సన్నిహితుడు, భారతదేశ మాజీ ఆర్థికమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి అరుణ్ జైట్లీ వర్థంతికి నివాళులు అర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

విశిష్ట న్యాయవాదిగా, సమర్థ నిర్వాహకుడిగా, నైపుణ్యం కలిగిన సంధానకర్తగా, నిష్కళంక రాజకీయనేతగా జైట్లీ సేవలు చిరస్మరణీయం అని వెంకయ్య కీర్తించారు. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విషయంలో ఏకాభిప్రాయం తీసుకురావడానికి జైట్లీ చేసిన అవిరళ కృషిని దేశం గుర్తుపెట్టుకుంటుంది అని, ఆయన చూపిన విలువలు, ఆదర్శాలను పాటించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.

దీనిపై మరింత చదవండి :