గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (22:54 IST)

పండిట్ జస్‌రాజ్ ఇకలేరు.. రాష్ట్రపతి - మోడీ సంతాపం

పండిట్ జస్‌రాజ్ ఇకలేరు. హర్యానా రాష్ట్రంలో జన్మించిన ఆయన 90 యేళ్ళ వయసులో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో సోమవారం కన్నుమూశారు. శాస్త్రీయ సంగీతంలో దేశ, విదేశాల్లో ఖ్యాతి గడించిన ఆయన మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలు తీవ్ర సంతాపం తెలిపారు.
 
మ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్‌రాజ్ మృతి తనను విషాదంలో ముంచెత్తిందని రాష్ట్రపతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 8 దశాబ్దాలకు పైగా అత్యద్భుతమైన కెరీర్ సాగించి సంగీత సామ్రాజాన్ని సుసంపన్నం చేసిన పద్మ విభూషణుడు జస్‌రాజ్ అని గుర్తుచేసుకున్నారు. జస్‌రాజ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
ఇకపోతే, పండిట్ జస్‌రాజ్ మృతి దురదృష్టకరమని, భారతీయ సాంస్కృతిక, సంగీత ప్రపంచానికి తీరని లోటని ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో వ్యాఖ్యానించారు. జస్‌రాజ్ సంప్రదాయ రాగాలు ఎంతో ప్రాచుర్యం పొందడమేకాకుండా, ఆయన ఎందరికో సంగీతంలో శిక్షణ ఇచ్చారని గుర్తుచేశారు. పండిట్ జస్‌రాజ్ కుటుంబ సభ్యులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు మోడీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.