శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (19:08 IST)

ఆంధ్రప్రదేశ్‌పై కరోనా వైరస్ రక్కసి ... పారిశ్రామికవేత్త మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో కరోనా రోగులతో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు.. గడచిన 24 గంటల్లో 93 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది చనిపోయారు. ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనాతో మరణాలు నమోదవుతుండడంపట్ల ఆందోళన నెలకొంది.
 
ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,296కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 9,597 పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,146 కాగా, ఇంకా 90,425 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, 6,676 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకు 1,61,425 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది.
 
ఇదిలావుండగా, తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా వైరస్ సోకి చనిపోయారు. గత కొన్నిరోజులుగా ఈ మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పాలెం శ్రీకాంత్ రెడ్డికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన గతంలో కడప లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.