మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (14:08 IST)

కూడబలుక్కుని లేఖ రాస్తారా? బీజేపీతో చేతులు కలిపారేమో? : సీనియర్లపై రాహుల్ ఫైర్

కాంగ్రెస్ పూర్వ అధ్యుక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నడూ లేనంత కోపం వచ్చింది. ఎపుడూ ప్రశాతంగా ఉండే రాహుల్... ఒక్కసారిగా పార్టీలోని సీనియర్ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీనికి కారణం కొందరు సీనియర్లు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడమే. 23 మంది సీనియర్ నేతలు కూడబలుక్కుని సోనియాకు లేఖ రాయడం ఆయనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. 
 
కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై చర్చలు జరిపేందుకు ఆ పార్టీ సీడబ్ల్యూసీ కీలక భేటీ కొనసాగుతోంది. 23 మంది సీనియర్లు రాసిన లేఖను ఆ పార్టీ నేత వేణుగోపాల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న సందర్భంలో ఆ లేఖను సోనియాకు ఎందుకు పంపించారంటూ నేతలను నిలదీశారు. అంతేకాకుండా ఆ సమయంలో సోనియా గాంధీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని, ఆ సమయంలోనే లేఖ పంపారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. అసమ్మతి సభ్యులు బీజేపీతో చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
పార్టీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో లేఖలు రాయడం భావ్యమా? అని నిలదీశారు. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను కూడా బాహాటంగానే చర్చిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ విషయాలు ప్రత్యర్థులకు కూడా తెలిసిపోతున్నాయని తీవ్రంగా ధ్వజమెత్తారు.
 
దీంతో ఒక్క సారిగా వాతావరణం గంభీరంగా మారిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ లేఖపై మాజీ ప్రధాని మన్మోహన్ కూడా స్పందించారు. ‘‘లేఖ రాయడం చాలా దురదృష్టకరం. ఆ లేఖ హైకమాండ్‌ను, పార్టీని కూడా బలహీనపరుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇక సీనియర్ నేత ఆంటోనీ కూడా లేఖపై సీరియస్ అయ్యారు. 
 
కాగా, ఈ భేటీలో మొత్తం 48 మంది నేతలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఈ సమావేశంలో సోనియా గాంధీ కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని ఆమె సూచించినట్లు సమాచారం. అయితే, అందుకు కొందరు నేతలు నిరాకరించారు.
 
పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు పలువురు కోరారు. గాంధీ కుటుంబం చేతిలోనే అధ్యక్ష పగ్గాలు ఉండాలని కొందరు వాదిస్తున్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు అంటున్నారు. మొత్తంమీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ ఇపుడు నెలకొంది.