బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (15:11 IST)

సైనిక చర్యకు సర్వదా సిద్ధం : చైనాకు భారత్ వార్నింగ్

భారత్ - చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని మహా దళపతి జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. తమ శాంతి చర్చలు విఫలమైన పక్షంలో సైనిక చర్యకు కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. 
 
గత కొన్ని రోజులుగా భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్న విషయం తెల్సిందే. చైనా ఆర్మీ అతిక్రమణలను ఎదుర్కోడానికి చర్చల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నామని, అవి సఫలం కాకపోతే మాత్రం మిలటరీ యాక్షన్‌కు భారత సైన్యం సిద్ధంగానే ఉందని ఆయన ప్రకటించారు. మిలటరీ యాక్షన్ ప్రతిపాదన తమ వద్ద సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. 
 
'ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపుపైనే భిన్నాభిప్రాయాలు. ఈ అతిక్రమణలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం శాంతియుతంగానే పరిష్కారం కోరుతోంది. ఎల్‌ఏసీ వెంట యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి ఈ ప్రయత్నాలు సఫలం కాకపోతే మాత్రం సైనిక చర్యలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం' అని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. 
 
పరిస్థితులను శాంతి యుతంగా పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ముఖ్యంగా, భారత్ శాంతి దేశమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.