సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (16:19 IST)

ప్రత్యేక రైలులో సొంతూరుకు వెళ్లిన భారత రాష్ట్రపతి

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రత్యేక రైలులో తన సొంతూరుకు బయలుదేరివెళ్ళారు. తన భార్య సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్‌లోని స్వస్థలానికి రైలులో బయలుదేరారు. ఢిల్లీ సప్ధర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కగా.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వేబోర్డు చైర్మన్‌, సీఈఓ సునీశ్‌ శర్మ వీడ్కోలు పలికారు. 
 
ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేశారు. రాంనాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటిసారిగా స్వగ్రామానికి రైలులో వెళ్తున్నారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరగా.. సాయంత్రానికి కాన్పూర్‌ చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైలు కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురాల వద్ద కొద్దిసేపు ఆగనుంది. 
 
కాగా, ఈ పర్యటనలో రాష్ట్రపతి పాత పరిచయస్తులను, పాఠశాల స్నేహితులను కలువనున్నారు. గ్రామాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఈ నెల 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో లక్నోకు చేరుకుంటారు. 
 
అక్కడ పర్యటన అనంతరం తిరిగి 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి రానున్నారు. 15 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి రైలు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో ప్రయాణించారు.