శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (10:05 IST)

కొనసాగుతున్న రైతుల ఆందోళన - రిలే నిరాహారదీక్షలు - సొంత పత్రిక కూడా..

ప్రధాని మోడీ ప్రభుత్వ తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కొనసాగుతూనే వుంది. ఇది మూడు వారాలకుపైగానే కొనసాగుతోంది.
 
ఈ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా ‘శ్రద్ధాంజలి దివస్’ను పాటించిన రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగుతున్నారు. అన్ని నిరసన కేంద్రాల వద్ద దీక్షలు ప్రారంభమవుతాయని రైతు నేతలు తెలిపారు.
 
సోమవారం 11 మంది రైతులు సింఘు సరిహద్దు వద్ద దీక్ష ప్రారంభిస్తారని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. హరియాణాలోని రహదారులపై ఈ నెల 25 నుంచి 27 వరకు టోల్‌ఫీజులను చెల్లించకుండా అడ్డుకుంటామని కిసాన్ యూనియన్ నేత జగ్జీత్ సింగ్ దలేవాలా తెలిపారు.  
 
అలాగే, ఈ నెల 27న ప్రధాని ‘మన్‌ కీ బాత్’ ప్రసంగ సమయంలో పళ్లాలతో చప్పుడు చేస్తూ నిరసన తెలపాలని ప్రజలను కోరారు. కాగా, రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ అసంపూర్తిగానే మిగిలాయి. 
 
దీంతో మరో ఒకటి, రెండు రోజుల్లో చర్చలు ప్రారంభించనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. మరోవైపు, రైతులను చర్చలకు ఆహ్వానిస్తూ వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ నిన్న రైతు సంఘాలకు లేఖ రాశారు. ఏ రోజున వీలవుతుందో చెప్పాలని అందులో కోరారు.
 
ఇదిలావుంటే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు తమ వాణిని వినిపించేందుకు సొంత పత్రికను స్థాపించారు. ఉద్యమ వివరాలతో కూడిన సమస్త సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ‘ట్రాలీ టైమ్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ పత్రిక తొలి ప్రతిని శనివారం ఆవిష్కరించారు. ఇది ద్విభాషా పత్రిక.
 
ఆందోళనలో పాల్గొంటున్న రైతులకు తప్పుడు సమాచారం అందకూడదన్న ఉద్దేశంతోనే ఈ పత్రికను తీసుకొచ్చినట్టు రైతు నేతలు తెలిపారు. ఇందులో రైతుల నేతల ఇంటర్వ్యూలు, ప్రభుత్వ తీరు, ఇతర రైతాంగ ఉద్యమ అంశాలను ప్రచురించనున్నట్టు చెప్పారు. వారానికి రెండుసార్లు ఈ పత్రికను ప్రచురిస్తామన్నారు.