విస్తారా ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు
విస్తారా ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం దిల్లీ నుంచి పుణె బయల్దేరిన విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానం మొత్తం తనిఖీలు చేశారు. బాంబు లేదని నిర్దారించుకున్న తర్వాత విమానం ఆలస్యంగా బయల్దేరినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు.
'ఈ రోజు ఉదయం దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఉన్న జీఎంఆర్ కాల్ సెంటర్‌కు ఢిల్లీ - పుణె విస్తారా విమానంలో బాంబు ఉందని ఫోన్ వచ్చింది. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశాం. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబును గుర్తించలేదు' అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీనిపై విమానాశ్రయ సిబ్బంది దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.