సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (09:29 IST)

నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం

parliament
పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో బీజేపీపై ఎదురుదాడి చేసేందుకు అస్త్రశస్త్రాలతో విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరిగాయి. ఆ తర్వాత రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ వాడివేడిగా సాగనుంది.
 
ఫైనాన్స్ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం, అదానీ వ్యవహారం, ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై కేంద్రాన్ని తూర్పారబట్టాలని విపక్షాలు తమ వద్ద ఉన్న ఆధారాలతో పాటు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. అదానీ - హిండెన్ బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో ఆందోళన చేయనుంది.
 
మరోవైపు, రెండో విడత బడ్జెట్ సమావేశాలపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ స్పందిస్తూ, ఈ సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లులను ఆమోదింపజేసుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అంశంమని, ఆ తర్వాతే విపక్ష పార్టీల డిమాండ్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు.