తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు నేటితో ముగింపు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజైన ఆదివారం ఉభయసభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. అలాగే, శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చిస్తారు.
ఈ చివరి రోజు సమావేశాల్లో భాగంగా, మండలి ప్రారంభంకాగానే డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంకానుంది. ఈయన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారు.
మరోవైపు ఈ నెల ఆరో తేదీన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శాఖలవారీగా బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లపై శనివారం అర్థరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ కొనసాగింది. దీంతో ఆదివారం శాసనసభలో మంత్రి హరీష్ రావు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు.
బిల్లుపై సీఎం కేసీఆర్ సమాధానమిస్తారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ దావఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై మంత్రులు సమాధానమిస్తారు.