మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2023 (09:36 IST)

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్ లేనట్టేనా?

shivraj singh
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్ లేనట్టేనా.. ఆయన తాజాగా చేసిన అందరికీ రామ్ రామ్ అనే ట్వీట్ దేనికి నిదర్శనం. ఇటీవల వెల్లడైన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే, ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై తర్జనభర్జన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేసిన ఓ ట్వీట్‌ దుమారం రేపుతోంది.
 
'అందరికీ రామ్‌ రామ్‌' అంటూ శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఇకపై తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే ఆయన అలా ట్వీట్‌ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధిష్ఠానం ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. 
 
పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. ట్వీట్‌పై చౌహాన్‌ స్పందిస్తూ.. తన ట్వీట్‌ అంతరార్థం అది కాదని చెప్పారు. ఎవరినైనా పలకరించేటప్పుడు 'రామ్‌.. రామ్‌' అని చెప్పడం ఇటీవలకాలంలో సర్వ సాధారణమైందని, రాముడి పేరుతో దిన చర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్‌ చేశానని చెప్పారు. కానీ ఆయన ట్వీట్‌లో ద్వంద్వార్థం ఉండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇదిలావుంటే, మధ్యప్రదేశ్‌లో సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్‌ సింగ్‌తోపాటు జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఉన్నారు.
 
అలాగే, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో ఆదివారం భాజపా శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇటీవల ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించనున్నారు. ఈ భేటీకి పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, శర్బానంద సోనోవాల్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ హాజరు కానున్నారు. భాజపా ఛత్తీస్‌గఢ్‌ ఇన్‌ఛార్జి ఓం మాథుర్‌, కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, పార్టీ ఇన్‌ఛార్జి నితిన్‌ నబీన్‌ కూడా పాల్గొంటారు.