ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (14:30 IST)

రెమ్‌డెసివిర్‌ మాత్రమే కాదు.. బ్లాక్ ఫంగస్‌కు కూడా కొరతే..

కరోనా కష్టకాలంలో దేశంలో పలు రకాలైన మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇపుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ నివారణకు ఉపయోగించే మందులు కూడా కొరత ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దానిని నయం చేసేందుకు ఇటీవలికాలంలో యాంఫోటెరిసిన్ బీ మందుల వినియోగమూ పెరిగిపోయింది. అయితే, ఆ డిమాండ్‌కు తగిన సరఫరా మాత్రం లేదు. కొన్ని చోట్ల ఆ మందులు లేకపోవడంతో బ్లాక్ దందానూ మొదలుపెట్టేశారు.
 
మొన్నటిదాకా అన్ని ఔషధ దుకాణాల్లో లభించిన ఈ మందు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇప్పుడు ఏ దుకాణంలోనూ దొరికే పరిస్థితి లేదని లక్నో కెమిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి మయాంక్ రస్తోగి అన్నారు. గత వారం వరకు రోజూ సగటున ముగ్గురు నలుగురే ఆ మందు కోసం రాగా.. ఇప్పుడు ఆరుగురి వరకు వస్తున్నారని చెప్పారు. ఆ మందుల స్టాక్ రావడానికి మరో 15 రోజులైనా పడుతుందన్నారు.
 
కర్ణాటకలోనూ కేసులు పెరిగిపోతుండడం, యాంఫోటెరిసిన్ మందులు లేకపోవడంతో కనీసం 25 వేల ఇంజెక్షన్లను పంపించాల్సిందిగా కేంద్రాన్ని కర్ణాటక ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97 దాకా బ్లాక్ ఫంగస్ కేసులున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లక్ష ఇంజెక్షన్ల కోసం టెండర్లను పిలిచింది. గుజరాత్ ప్రభుత్వం 1,14,430 ఇంజెక్షన్లకు ఆర్డర్ పెట్టింది.
 
డిమాండ్ భారీగా పెరగడంతో యాంఫోటెరిసిన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని కోసం ఔషధ తయారీ సంస్థలకు ఇప్పటికే రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తులూ పంపింది. దాంతో పాటు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది.