ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (18:20 IST)

నితిన్ గడ్కరీకి ప్రశంసలు.. బల్లచరిచిన సోనియా.. అసలేం జరుగుతుంది?

మొన్నటికి మొన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంటిని, ఇల్లాలిని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి ఇక దేశాన్ని ఎలా రక్షిస్తాడని గడ్కరీ.. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా గట్స్ వున్న నేత అంటూ కితాబిచ్చారు. ఇందుకు గడ్కరీ రాహుల్ సర్టిఫికేట్ తనకు అక్కర్లేదని కౌంటరిచ్చారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా గడ్కరీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ చప్పట్లు కొట్టారు. అదీ పార్లమెంట్ వేదికగా. ఇంతకీ ఏం జరిగిందంటే..? నితిన్ గడ్కరీ పనితీరుపై లోక్ సభలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ శాఖపై రెండు ప్రశ్నలను స్పీకర్ చర్చకు స్వీకరించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. పార్టీలతో సంబంధం లేకుండా పార్లమెంట్‌లోని ఎంపీలందరూ వారి నియోజకవర్గాల్లో తన శాఖ ద్వారా జరిగిన పనులకు కితాబిస్తున్నారని చెప్పారు. వెంటనే  వెంటనే బీజేపీ సభ్యులంగా బల్లలను చరుస్తూ అభినందలను తెలిపారు. 
 
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ లేచి నిలబడి... గడ్కరీ కృషికి సభ అభినందనలు తెలపాలని స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను కోరారు. అంతే లోక్‌సభలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అప్పటివరకు గడ్కరీ చెప్తున్న విషయాలను ఓపిగ్గా వింటూ వచ్చిన యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ.. గడ్కరీని అభినందిస్తూ బల్ల చరిచారు. తర్వాత కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలందరూ బల్లను చరుస్తూ గడ్కరీని అభినందించారు. 
 
గత ఆగస్టులో యూపీలోని తన నియోజకవర్గంలో ఉన్న రహదారుల సమస్యపై సానుకూలంగా స్పందించారంటూ ధన్యవాదాలు చెప్తూ  సోనియా గాంధీ.. నితిన్ గడ్కరీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇంకేముంది.. మోదీని, అమిత్ షాను ఉద్దేశించి గడ్కరీ వ్యాఖ్యలు చేయడం విపక్షాలు కొనియాడటం.. బల్ల చరచడం వంటివి చూస్తే.. అసలేం జరుగుతుందని.. నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.