2019-20 బడ్జెట్ : శుక్రవారం 11 గంటలకు బహిర్గతం...
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ సాంప్రదాయాలకు భిన్నంగా ఫిబ్రవరి 1వ తేదీన పూర్తి బడ్జెట్‌ని ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ కసరత్తులు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 11 గంటలకు ఆయన లోక్‌సభలో వెల్లడిస్తారు.
ప్రభుత్వం రైతులకు, గ్రామీణ ప్రాంతవాసులకు మరియు మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్‌లో తాయిలాలు ప్రకటించడంలో వెనుకడుగు వేయకూడదని భాజపా పార్టీ శ్రేణులలో ఆశిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం జూలైలో పూర్తి బడ్జెట్‌ని ప్రవేశపెట్టేలోపు మూడు నెలల వరకు మాత్రమే మధ్యంతర అమలులో ఉంటుంది. గతంలో మధ్యంతర బడ్జెట్‌ల పేరిట కీలక వరాలు ప్రకటించినప్పటికీ, అధికారపక్షం మళ్లీ అధికారం చేజిక్కించుకోవడం అనేది ఎప్పుడూ జరిగే పని కాదు.
రాబోయే కీలక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకుగానూ ఇప్పటికే అందుబాటులో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై ప్రేమని నటిస్తూనే తమ ప్రధాన ఓటు బ్యాంక్ అయిన అగ్రవర్ణాలను కూడా తిరిగి అక్కున చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు మధ్యంతర బడ్జెట్‌ని బీజేపీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్న సమయంలో బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగడం ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వ్యవహరించారో దేశమంతా చూసిందని, తమను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని ఆరోపిస్తున్నారు.
గతేడాది బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం రైతుల కోసం..ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్ల కనీస మద్దతు ధరను ప్రకటించినప్పటికీ అది అంతంతమాత్రంగానే ప్రభావం చూపింది. దీంతో ఈ బడ్జెట్‌లోనే రైతులపై మోడీ వరాల జల్లు కురిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటమితో మోడీ వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్లుగా అర్థమవుతోంది. మరోవైపు రుణమాఫీ చేస్తాం, ప్రజలందరికీ కనీస ఆదాయం స్కీమ్ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని మోడీ తన మార్క్ బడ్జెట్‌తో ఎంత మేరకు తిప్పికొడ్తారో 1వ తేదీ వరకు వేచి చూడవలసిందే.