శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 6 జనవరి 2019 (12:35 IST)

పొత్తు పొడిచింది : యూపీలో ఎస్పీ - బీఎస్పీ స్నేహగీతం

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్నామొన్నటివరకు బద్ధ శత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఇపుడు స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే, సీట్ల పంపిణీపై ఈనెలాఖరులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. 
 
ఇదే విషయంపై ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి స్పందిస్తూ, ఇటీవలి కాలంలో తరచుగా భేటీ అవుతున్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. అఖిలేశ్, మాయావతి శుక్రవారం ఢిల్లీలో మరోసారి సమావేశమయ్యారని, పొత్తు విషయమై ఇతర చిన్న పార్టీలతోనూ చర్చలు కొనసాగుతున్నాయని, ఈ పార్టీల్లో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ) కూడా ఉందన్నారు. 
 
ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీని చేర్చుకోవాలా? లేదా? అనే విషయాన్ని అఖిలేశ్, మాయావతి నిర్ణయిస్తారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే అమేథీ, రాయ్‌బరేలీలో తమ కూటమి అభ్యర్థులను బరిలోకి దింపబోదని, ఆ రెండు స్థానాలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చీఫ్ సోనియా గాంధీకి వదిలివేస్తామని రాజేంద్ర చౌదరి తెలిపారు. దేశ రాజకీయాల్లో ఎంతో కీలకమైన యూపీలో 80 పార్లమెంట్ స్థానాలున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యూపీలో బీజేపీ ఏకంగా 71 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.