శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (14:05 IST)

శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేస్తే..?

మానవుడికి జన్మతోనే దుఃఖం వెంటవస్తుంది. దారిద్ర్య దుఃఖ భయాలతో జీవితమంతా సతమతమై దిక్కుతోచక కొట్టుకుంటూ ఉంటాడు. అనూచానంగా వస్తున్న అనేక ఆరాధనా విధానాలను యాంత్రికంగా ఆచరిస్తుంటారు. ఏకాగ్రత ఉండదు. ఫలితాలు కూడా ఉండవు. మోతాదు మించిన వేదాంతంతో మరికొందరు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. వాళ్లు వేదాంతం గురించి చాలా చర్చిస్తారు. అందులో ఒక్కటి కూడా ఆచరణలో పెట్టరు. 
 
ఇంకొందరు బాహ్యాడంబరాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. త్రిపుండ్రాలు, రుద్రాక్షలు, చెవులో తులసీదళాలు, నోట్లోనామం, మనసు మరెక్కడో.. దైవం వీరెవ్వరికి అందుబాటులో ఉండడు. కారణం, ప్రాపంచిక సౌఖ్యాలకోసం, కామనలకోసం పరితపించే మనసు, ఎట్టి పరిస్థితుల్లోను దైవం మీద లగ్నం కాలేదు. క్షుధార్తుడికి అన్నం కావాలి. దాహార్తికి చల్లని నీరు కావాలి. ఇవి జరిగితేనే గానీ మనో చాంచల్యం నివారించబడదు.
 
మనసు నిలకడ రానిదే, మన పిలుపు దైవానికి వినపడదు. కారణం, శరీరానికి చెందిన భౌతిక.. అధి భౌతిక శక్తులు ఏకీకృతం కావడానికి అవరోధనం మనసే. మరి మనకి దైవానుగ్రహం ఎలా లభిస్తుంది..? ముందు మన సమస్యలకు పరిష్కారం లభిస్తే.. మనకు జరగడానికి కారణమైన దైవం మీద గురి ఏర్పడుతుంది. అది క్రమంగా భక్తిగా మారుతుంది. అది కైవల్యానికి దారితీస్తుంది. అంటే..
 
సర్వలోక వంశకర్యైనమః
సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయైనమః 
వాంఛితార్ధ ప్రదాయిన్యైనమః
 
అనే నామాలు.. ఇంకా ఇలాంటి వెన్నో శ్రీ లలితా సహస్రనామాలలో మనకు ఆణిముత్యాల వలే లభిస్తాయి. శ్రీ లలితా సహనామం నిత్యం శ్రద్ధా భక్తులతో పారాయమ చెయ్యగలిగినవారు.. జన్మ మృత్యు జర, దారిద్ర్య, రోగ విముక్తులవడమే కాకుండా.. అందరి చేత మన్ననలందుకుని, అగ్రగణ్యులుగా గుర్తించబడుతారు. అన్న, వస్త్ర, ధన, ధాన్య సమృద్ధి కలుగుతుంది. సాధారణంగా ప్రతీ మనిషి కోరేవి ఇవే కదా..?
 
శ్రీ లలితా సహస్రనామ పారాయణ.. నవమి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య, శుక్రవారాలలో విశేష ఫలితాలనిస్తుంది. కాబట్టి, భక్తులు అమూల్యమయిన ఈ నామాలను పఠిస్తూ, కల్పవృక్షఁ నీన ఉన్న విధంగా తమ ఇష్టకామ్యాలను పొందుతూ, జన్మాంతంలో కైవల్యాన్ని పొందగలరు.