అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
యూఎస్ కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగిందని తొలుత అక్కడి మీడియా పేర్కొంది. భారీగా మంటలు వ్యాపించాయని అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వాటిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది.
ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి కారణంగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ దాడిని ధ్రువీకరించారు. అయితే, కార్యాలయంలోని సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
కాన్సులేట్ సమీపంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని.. భయంతో పరుగులు తీశామని సమీపంలోని వారు మీడియాకు వివరించారు. కాగా, మంగళవారం సౌదీఅరేబియాలోని రియాద్‍లో ఉన్న అమెరికా ఎంబసీపై ఇరాన్ రెండు డ్రోన్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే.
అమెరికా లక్ష్యంగా సౌదీ అరేబియాపై ఇరాన్ మరోసారి డ్రోన్ దాడికి పాల్పడింది. రియాద్‌లోని యూఎస్ ఎంబసీలో ఉన్న సీఐఏ స్టేషన్‌పై రెండు డ్రోన్లు దాడి చేశాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో దట్టమైన పొగ వ్యాపించిందని.. భవనం దెబ్బతిన్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం ఇంకా తెలియాల్సిఉంది.