శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (12:17 IST)

అల్లుడి ఇంట్లో నివసించే అత్త.. చట్టబద్ధ ప్రతినిధే: సుప్రీంకోర్టు

అత్త - అల్లుళ్ళ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ​​​​​​అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందడానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. 
 
'అల్లుడు - కుమార్తెల వద్ద అత్త నివసించడం భారత సమాజంలో అసాధారణమేమీ కాదు. వృద్ధాప్యంలో పోషణ నిమిత్తం అల్లుడిపైనా ఆధారపడుతుంటారు. అల్లునికి అత్త చట్టబద్ధమైన వారసురాలేమీ కాదు. కానీ ఆయన మరణించినప్పుడు తప్పకుండా ఇబ్బందులు పడుతుంది. అందువల్ల పరిహారం పొందడానికి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 166 ప్రకారం ఆమె చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుంది'  అని పేర్కొంది. అలాగే, గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
 
ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే, కేరళకు చెందిన ఓ వ్యక్తి 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబానికి రూ.74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా పరిహారాన్ని రూ.48,39,728కు తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని తెలిపింది. 
 
దీనిపై మృతుని భార్య సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. మృతుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ.83,831 జీతం పొందిన విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. 52 ఏళ్ల వయసులో మరణించినందున ఆ కుటుంబం నష్టపోయిందని అభిప్రాయపడింది. అందువల్ల రూ.85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి పరిహారం చెల్లించే తేదీ వరకు 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని సూచించింది. అల్లునిపై ఆధారపడ్డ అత్త కూడా పరిహారానికి అర్హురాలేనని తెలిపింది.