సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (13:50 IST)

న్యాయ పోరాటంలో గెలిచిన 39 మంది మహిళా ఆఫీసర్లు

భారత ఆర్మీకి చెందిన 39 మంది మహిళా ఆఫీసర్లు న్యాయపోరాటంలో విజయం సాధించారు. ఫలితంగా వీరికి పర్మినెంట్ కమిషన్ లభించనుంది. ఇందుకోసం వారు చేసిన న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. వీరి కోసం పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
మొత్తం 71 మంది మ‌హిళా షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ అధికారులు త‌మ‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ క‌ల్పించాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వీళ్ల‌లో 39 మంది మాత్ర‌మే దీనికి అర్హులు అని కేంద్ర ప్ర‌భుత్వం.. అత్యున్న‌త న్యాయ‌స్థానానికి తెలిపింది. 
 
మ‌రో ఏడుగురు మెడిక‌ల్‌గా అన్‌ఫిట్ కాగా.. 25 మందిపై క్ర‌మ‌శిక్ష‌ణకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. అయితే ఈ 25 మంది ఎందుకు అర్హులు కారన్న దానిపై స‌వివ‌ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
ఈ 71 మందిలో ఎవ‌రినీ రిలీవ్ చేయ‌కూడ‌ద‌ని ఈ నెల ఒకటో తేదీనే సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ అంశంపై జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ బీవీ నాగ‌రత్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రుపింది. 
 
ఈ మ‌హిళా అధికారుల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఈ అధికారుల త‌ర‌ఫున వాదించిన న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. దీంతో 39 మంది అధికారుల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇచ్చే ప్ర‌క్రియ‌ను మూడు నెల‌ల్లో పూర్తిచేయాల‌ని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.