పాముతో కాటు వేయించి హత్య చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది.. సుప్రీం
పాముతో కాటు వేయించి హత్య చేయడం కొత్త ట్రెండ్‌గా మారిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. రాజస్థాన్‌కు చెందిన అల్పానా అనే వివాహిత వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని అత్త సుబోధ్ దేవిని ప్రియుడు మనీష్, స్నేహితుడు కృష్ణ కుమార్‌తో కలిసి పాముతో కాటు వేయించి హత్య చేశారు. 2019 జూన్ 2న జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
భార్య మృతిపై అనుమానించిన మామ రాజేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు జరుపగా సుబోధ్ దేవిని పాముతో కాటు వేసిన రోజు అల్పానా, ఆమె ప్రియుడు మనీష్ మధ్య 124 ఫోన్ కాల్స్, అల్పానా, కృష్ణ కుమార్ మధ్య 19 ఫోన్ కాల్ సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వారి మధ్య కొన్ని మెసేజ్‌లు కూడా షేర్ అయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2020 జనవరి 4వ తేదీ అరెస్టైన ఈ ముగ్గురు నిందితులు నాటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
అయితే సహ నిందితుడైన కృష్ణ కుమార్ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపింది. 'పాములు పట్టి ఆడించే వారి నుంచి పాములు తెచ్చి కాటు వేయించడం ద్వారా వ్యక్తులను హత్య చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ఇప్పుడు రాజస్థాన్‌లో సర్వసాధారణమైంది' అని జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు.
ప్రధాన నిందితుడితో కలిసి కృష్ణకుమార్ పాములు పట్టే వ్యక్తి వద్దకు వెళ్లి రూ.10 వేలకు పామును కొనుగోలు చేశారని, అయితే ఆ పామును తన స్నేహితుడు ఎందుకు కోసం కొనుగోలు చేస్తున్నాడన్నది తన క్లైంట్‌కు తెలియదని అతడి తరపు లాయర్ ఆదిత్య చౌదరి కోర్టుకు తెలిపారు.
పాముతోపాటు ఆ మహిళ ఇంటికి కూడా అతడు వెళ్లలేదని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి అయిన సహ నిందితుడు కృష్ణ కుమార్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. నిందితుడు కృష్ణ కుమార్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.