శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (20:36 IST)

టాటా మోటార్స్‌కు షాక్.. సింగూరు భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సింగూర్ భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇది టాటా మోటార్స్‌కు షాక్‌ తగినట్టయింది. సింగూరులో టాటా మోటార్స్‌కు కేటాయించిన భూములను సర్వోన్నత న్యాయస్థానం రద్

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సింగూర్ భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇది టాటా మోటార్స్‌కు షాక్‌ తగినట్టయింది. సింగూరులో టాటా మోటార్స్‌కు కేటాయించిన భూములను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇది టాటా సంస్థతో పాటు.. ఈ భూములను కేటాయించిన నాటి వామపక్ష ప్రభుత్వానికి కూడా ఎదురుదెబ్బలాంటిది. 
 
సింగూరులో నానో కార్ల తయారీ ప్లాంట్‌ కోసం 2006లో నాటి వామపక్ష ప్రభుత్వం 1000 ఎకరాల భూమిని టాటా మోటార్స్‌కు కట్టబెట్టింది. ఈ ప్లాంట్‌కు వ్యతిరేకంగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. 
 
దీంతో టాటా మోటార్స్‌ నానో కార్ల తయారీ కేంద్రాన్ని 2008లో గుజరాత్‌కు మార్చింది. 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి రాగానే... టాటా మోటార్స్‌కు వామపక్ష ప్రభుత్వం అప్పగించిన సింగూర్ భూములను స్వాధీనం చేసుకునేందుకు చట్టం తీసుకువచ్చింది. దీనిని టాటా మోటార్స్ కోల్‌కతా హైకోర్టులో సవాల్ చేసింది. అనంతరం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. 
 
దీనిపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం తుదితీర్పు ఇచ్చింది. భూముల ఒప్పందానికి సంబంధించి టాటామోటార్స్‌, అప్పటి వామపక్ష ప్రభుత్వం అవకతవకలకు పాల్పడ్డాయని, ఈ ఒప్పందం ఆశ్చర్యానికి గురి చేస్తోందని తుది తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భూములను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సర్వే చేయించి నిజమైన యజమానులకు వాటిని 10 వారాల్లోగా తిరిగి అప్పగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పులో స్థానికులు సంబరాలు జరుపుకొన్నారు.