శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (11:56 IST)

వెంటిలేటర్‌పై కమల్‌నాథ్ సర్కారు... ఊరట.. సభ 26కు వాయిదా

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కమల్ నాథ్ సర్కారు వెంటిలేటర్‌పై ఉంది. ఆ పార్టీకి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటు  బావుటా ఎగురవేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఫలితంగా ఆయన వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. 
 
ఈ కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో సోమవారం బలాన్ని నిరూపించుకోవాలంటూ గవర్నర్ లాల్జీ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించారు. అయితే, సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ అజెండాలోని అంశాల్లో విశ్వాస పరీక్షను స్పీకర్ ఎన్.ఆర్ ప్రజాపతి చేర్చలేదు. దీంతో కమల్‌నాథ్ సర్కారు ఊపిరి పీల్చుకుంది. 
 
నిజానికి గవర్నర్ ఆదేశాల మేరకు సోమవారం విశ్వాసపరీక్ష జరుగుతుందనుకున్నారు. విశ్వాస పరీక్షకు వెనుకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి కమలనాథ్ కూడా ప్రకటించారు. అయితే అసెంబ్లీ అజెండాలో చేరాల్సిన ఈ అంశం చేర్చలేదు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాల తీర్మానం తప్పించి విశ్వాస పరీక్ష అంశం ఎజెండాలో కనిపించలేదు. దీంతో సోమవారం పరీక్ష వాయిదాపడినట్టే. కాగా, స్పీకర్ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు బలపరీక్షకు సిద్ధమని సీఎం మరోసారి పునరుద్ఘాటించారు.

అయితే, స్పీకర్ ప్రజాపతి ఎవరూ ఊహించని విధంగా సభను ఈ నెల 26వ తేదీకి  వాయిదా వేశారు. దీనిపై భారత జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భగ్గునమండిపడుతున్నారు. గవర్నర్ ఆదేశాలను పట్టించుకోకుండా, ఎలాంటి కారణం చూపకుండానే ఈ నెల 26వ తేదీకి సభను వాయిదా వేయడం అప్రజాస్వామ్యమంటూ వారు మండిపడుతున్నారు.