ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (12:47 IST)

మధ్యప్రదేశ్ : సింధియా షాక్... పతనావస్థలో కమల్‌నాథ్ సర్కారు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం చేజారిపోనుంది. ఆ పార్టీకి చెందిన యువనేత, రాజవంశీయుడు జ్యోతిరాదిత్య సింధియా తేరుకోలేనిషాకిచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, ఆయన తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అత్తెసరు మార్కులతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోనుంది. 
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌కు యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు గత కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయి. ఇవి తారా స్థాయికి చేరాయి. ముఖ్యంగా, సింధియా పీసీసీ అధ్యక్ష పీఠంతో పాటు రాజ్యసభ సీటను ఆశించారు. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించలేదు. దీంతో తన వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో జ్యోతిరాదిత్య సింధియా సోమవారం రాత్రి అదృశ్యమయ్యారు. ఈ 17మందిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. 
 
ఈ క్రమంలో అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన జ్యోతిరాదిత్య కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తొలుత సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయనతో కలిసి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. పిమ్మట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించి, దాన్ని ట్విట్టర్ ఖాతలో పోస్ట్ చేశారు. 
 
మరోవైపు, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు సీనియర్‌ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమావేశమయ్యారు. భోపాల్‌లో బీజేపీ సీనియర్‌ నేతల సమావేశం జరుగుతోంది. మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సీనియర్‌ నేతలు వీడీ శర్మ, వినయ్‌ సహస్రబుద్ధి కీలక భేటీ నిర్వహించారు. 
 
సాయంత్రం 7 గంటలకు భోపాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరుగనుంది. ఈ సమావేశం తర్వాత వారు రాష్ట్ర గవర్నరుతో సమావేశమై, కమల్‌నాథ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా కోరే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలిపోవడం ఖాయం. సింధియా వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలంతా కలిసి బీజేపీకి మద్దతివ్వనున్నారు.