సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

దేశం వీడి పారిపోయేందుకు రాణా కుమార్తె ప్రయత్నం.. అడ్డుకున్న అధికారులు

ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుమార్తె రోషిణి కపూర్‌ దేశం వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఆమెను అడ్డుకున్నారు. 
 
నిజానికి దేశంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోవడం ఆనవాయితీ మారిపోయింది. ఇంలాటివారిలో వారు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోడీ వంటివారు ఉన్నారు. వీరంతా బ్యాంకుల వద్ద లక్షల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. 
 
ఇలాంటి సంఘటన మరొకటి జరుగకుండా అధికారులు నిలువరించారు. ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుమార్తె రోషిణి కపూర్ కూడా లండన్ పారిపోయేందుకు ప్రయత్నించగా అధికారులు ఆమెను నిలిపేశారు. 
 
ఆదివారం రోషిణి కపూర్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆమె ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో లండన్ వెళ్ళే విమానం ఎక్కుతుండగా అధికారులు నిలిపేశారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఆమె లండన్ వెళ్ళేందుకు ప్రయత్నించింది. 
 
డోల్ట్ అర్బన్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రోషిణి కపూర్ డైరెక్టర్. ఈ కంపెనీ మనీలాండరింగ్ కేసులో ఈడీ నిఘాలో ఉంది. అంతకుముందు రాణా కపూర్ అల్లుడు ఆదిత్యతో సహా ఆయన కుటుంబ సభ్యులందరిపైనా లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే.
 
కాగా, ఎస్ బ్యాంకు సంక్షోభం వెలుగులోకి రావడంతో రాణా కపూర్‌, తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ నెల 11 వరకు ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించారు. 
 
అదేసమయంలో ముంబైలోని వర్లి ప్రాంతంలోని రాణా కపూర్ నివాసం సముద్ర మహల్‌లో శుక్రవారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. శనివారం ఆయన కుమార్తెలు రాఖీ, రోషిణి, రాధాల నివాసంలో కూడా సోదాలు జరిపింది. ఈ కుంభకోణంలో వీరు కూడా లబ్ధిదారులేనని పేర్కొంది.