మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం.. పిక్కలు పట్టుకున్న కుక్క..!
మానసిక వికలాంగురాలైన తమ కూతురిని ఆ తల్లిదండ్రులు పక్కనబెట్టారు. ఇంట్లో ఆమెకు స్థానం ఇవ్వకుండా ఇంటి బయట షెడ్ వేసి అందులో ఆమెను వుంచారు. కానీ తల్లిదండ్రులకు ఆమెపై లేని కనికరం.. ఆ ఇంట్లో కాపలా కాసిన కుక్కకు వుంది. కామాంధుడు మీద పడితే అరవలేని పరిస్థితి. ఈ దౌర్భాగ్యాన్ని కాపలా కుక్క కళ్లారా చూసింది. అత్యాచారం చేయబోయిన ఆ దుర్మార్గుడి పిక్కలు పట్టుకుని లాగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సెల్వపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు మానసిక వికరాంగురాలు కావడంతో తల్లిదండ్రులు ఆమె కోసం ఓ షెడ్డు నిర్మించి అందులో ఉంచారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి గత నెల 29న బాధితురాలు ఉన్న షెడ్డులోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షెడ్డులో పవర్ కట్ చేశాడు.
దిలీప్ కుమార్ చర్యలను దూరం నుంచి గమనిస్తున్న ఆ ఇంటి పెంపుడు కుక్క అతడి వెనకే షెడ్డులోకి ప్రవేశించింది. అతడి కాలు పట్టుకుని గట్టిగా లాగే ప్రయత్నం చేసింది. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయిన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కుక్క మాత్రం అతడిని విడిచి పెట్టలేదు. గట్టిగా అరుస్తూ ఇంట్లో వాళ్లని మేల్కొలిపింది.
దాని అరుపులకు బయటకు వచ్చిన వికలాంగురాలి తల్లిదండ్రులు దిలీప్ కుమార్ను గమనించారు. వెంటనే ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సహాయంతో అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిలీప్ కుమార్ ఫోన్ని పరిశీలించగా అందులో మహిళల అసభ్యకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయి.
మానసిక వికరాంగురాలైన కన్నబిడ్డను కనికరం లేకుండా షెడ్డులో ఉంచారని స్థానికులు తల్లిదండ్రులను విమర్శిస్తున్నారు. కుక్కకి ఉన్న విశ్వాసం కూడా తల్లిదండ్రులకు లేక పోయిందని అంటున్నారు. నోరున్న మనుషులకంటే నోరులేని మూగజీవాలే నయం అని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.