గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (11:10 IST)

భర్త ఇంటి ముందే భార్య మృతదేహం పూడ్చివేత

burrial in front of house
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట జిల్లాలో భర్త, అత్తమామల వేధింపులు కారణంగా నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆ గర్భిణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పోలీసులు బంధువులకు అప్పగించారు. అయితే, వారు మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టకుండా, భర్త ఇటి ముందే పూడ్చి పెట్టారు. దీనికి సంబంధించి 50 మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అన్నవాసల్ సమీపంలోని విలాసపట్టిలో గత నెల 29వ తేదీన కుటుంబ సమస్యతో నాగేశ్వరి అనే 8 నెలల గర్భిణి విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుదుక్కోట  ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
 
ఈ ఆత్మహత్య కేసులో ఆమె భర్త, మామ తంగమణి, అత్త విజయలను పోలీసులు అరెస్టు చేసి జైలుకుపంపించారు. ఈ ముగ్గురు జైలులో ఉండగా, నాగేశ్వరి మృతదేహాన్ని విలాపట్టిలోని భర్త ఇంటి ముందు గొయ్యి తీసి పాతిపెట్టారు. ఈ విషయాన్ని విజయ సోదరుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. దీంతో అన్నవాసల్ పోలీసులు మృతదేహాన్ని ఇంటి గేటు వద్ద పూడ్చిపెట్టినందుకు 50 మందిపై కేసు నమోదు చేశారు.