గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (14:29 IST)

తిరుమలలో ఫ్రాంక్ వీడియో... బిగుస్తున్న ఉచ్చు.. యూట్యూబర్ క్షమాపణలు!!

ttfvasan
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమలలో ఫ్రాంక్ వీడియో తీసిన తమిళ యూట్యూబర్‌ టీటీఎఫ్ వాసన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ ఫ్రాంక్ వీడియో తీసిన ఘటనపై తితిదే అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే. దీంతో వాసన్‌తో పాటు ఫ్రాంక్ వీడియో తీసిన వారిపై కేసు నమోదైంది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు వాసన్ క్షమాణలు చెబుతూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మరోమారు ఇలాంటి పిచ్చిపనులు చేయబోమని వీడియోలో ప్రాధేయపకడ్డారు. అందువల్ల ఈ వ్యవహరంలో మనస్పూర్తిగా క్షమించాలని విజ్ఞప్తిచేశాడు. 
 
ఇటీవల శ్రీవారి దర్శనం కోసం స్నేహితులతో కలిసి వచ్చిన వాసన్ క్యూలో ఉండగా నారాయణగిరి షెడ్స్ కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో భక్తులను వదిలేందుకు దాని తాళాలు తీస్తున్నట్టు హడావుడి చేస్తూ ప్రాంక్ వీడియో షూట్ చేశాడు. అతడిని టీటీడీ సిబ్బందిగా భావించిన భక్తులు నిజంగానే కంపార్ట్‌మెంట్ తాళాలు తీస్తున్నాడని భావించారు. వారిని చూసి వెకిలిగా నవ్వుతూ వారు అక్కడి నుంచి తప్పుకున్నారు. ఈ వీడియోను వారు ఆ తర్వాత తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.
 
ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది. తన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని భావించిన వాసన్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. 
 
తాము కూడా శ్రీవారి భక్తులమేనని, భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీశామని, అయితే మిత్రుడి చర్యల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశాడు. ఇకపై ఇలాంటి వీడియోలకు దూరంగా ఉంటామని, తమను మనస్ఫూర్తిగా క్షమించాలని వేడుకున్నాడు. కాగా, నిందితుల కోసం తిరుమల పోలీసులు గాలిస్తున్నారు.