బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (17:48 IST)

కరోనా సెంకడ్ వేవ్ విలయానికి కేంద్ర మనోవైకల్యమే కారణం!

ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ రెండో వ్యాప్తికి కారణం కేంద్ర ప్రభుత్వ మనోవైకల్యమేనంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలకు కట్టుదిట్టంగా పనిచేయాల్సిన కేంద్రం.. తద్విరుద్ధంగా.. తన చర్యలకు క్రెడిట్ సంపాదించేందుకు వెంపర్లాడుతుందని, ఇలాంటి అయోమయ విధానాలే సెంకడ్ వేవ్ విలయానికి కారణంగా నిలిచాయన్నారు. 
 
కేంద్రం అనుసరించిన ఉదాసీనవైఖరి కారణంగా దేశం అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇండియాలో ఫార్మా కంపెనీల సామర్థ్యం ఎంతో ఉందని, అలాగే ప్రజల్లో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువేనని ఆయన చెప్పారు. 
 
అసలు ఈ కోవిడ్ మహమ్మారిపై పోరు జరిపే సత్తా ఇతర దేశాలకన్నా మన దేశానికి ఎక్కువే అన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. రాష్ట్ర సేవా దళ్ ఆధ్వర్యాన ముంబైలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ సెకండ్ వేవ్ విలయానికి కేంద్ర ప్రభుత్వ ‘మనోవైకల్యమే’ కారణమని కుండబద్ధలుకొట్టినట్టు చెప్పేశారు. 
 
ప్రభుత్వంలో అయోమయం నెలకొన్న ఫలితంగా ఈ సంక్షోభాన్ని సరిగా ఎదుర్కోలేకపోయిందని, తన శక్తిని ప్రదర్శించలేకపోయిందన్నారు. మహమ్మారిని నివారించడానికి బదులు తన కృషికి క్రెడిట్ దక్కేలా చూపడంపైనే ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. బహుశా ఈ ప్రపంచాన్ని కాపాడగలనని భారత్ భావించిందని, ఇదేసమయంలో దేశ వ్యాప్తంగా ఈ మహమ్మారిపై ప్రజలపై పట్టు బిగించిందన్నారు. 
 
దేశంలో ఆర్థిక వృద్ధి రేటు మందగించిందని, నిరుద్యోగ సమస్య తీవ్రమైందని అమర్త్య సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి క్షీణత, సామాజిక బాధ్యతల వైఫల్యం ఈ మహమ్మారితో పాటు దేశంపై దాడి వంటిది జరగడానికి దారి తీశాయని అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు.