వ్యాక్సిన్ల కోసం హైదరాబాద్ సంస్థ రూ.1500 కోట్లతో ఒప్పందం
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా, కీలకంగా మారిన వ్యాక్సిన్ల కొరతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత నెలకొనివుంది. దీన్ని అధిగమించడానికి కేంద్ర సర్కారు హైదరాబాద్‌లోని బయోలాజికల్-ఈ తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆర్‌బీడీ ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆ సంస్థ పెద్ద మొత్తంలో టీకాలను ఉత్పత్తి చేయడం కోసం కేంద్ర సర్కారు ఈ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే దేశీయ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను దేశ వ్యాప్తంగా ప్రజలకు వేస్తుంది.
బయోలాజికల్ -ఈ అభివృద్ధి చేస్తోన్న ఆర్‌బీడీ ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్ వినియోగంలోకి రానున్న రెండో భారతీయ టీకాగా నిలవనుంది. ఒప్పందంలో భాగంగా 30 కోట్ల డోసుల ఉత్పత్తికి కేంద్ర సర్కారు ముందస్తు చెల్లింపులు చేసింది.
ఇందుకుగానూ మొత్తం రూ.1500 కోట్లు ముందస్తుగా చెల్లించింది. ఇప్పటికే 1, 2 దశల క్లినికల్ ట్రయల్స్ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్-ఈ సంస్థ అందజేసింది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుతోంది. కొన్ని రోజుల్లో ఈ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది