శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (11:45 IST)

ఢిల్లీ మెట్రో రైల్ జర్నీ : టోకెన్లకు స్వస్తి ... స్మార్టు కార్డులే ముద్దు

కరోనా లాక్డౌన్ కారణంగా గత ఐదు నెలలుగా స్తంభించిపోయిన ప్రజా రవాణా ఇపుడు దశలవారీగా ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 4 పేరుతో విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఫలితంగా ఢిల్లీలో మెట్రో సర్వీసులను పునరుద్ధరించేందుకు ఢిల్లీ సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. 
 
ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటే.. కేవలం స్మార్ట్‌ కార్డులనే అనుమతించనున్నట్లు ప్రకటించింది. మెట్రో రైలు టోకెన్లను ఇక నుంచి జారీ చేయమని స్పష్టం చేసింది. కేవలం స్మార్ట్‌కార్డ్‌, ఇతర డిజిటల్‌ పేవ్‌మెంట్ పద్ధతుల్లోనే ప్రయాణికులను అనుమతించనున్నట్లు చెప్పింది. 
 
సెప్టెంబరు 7వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే మెట్రో రైల్ సర్వీసుల్లో కూడా ప్రయాణికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్ తెలిపారు. 
 
అలాగే స్టేషన్‌లోకి వచ్చే సమయంలో ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 
 
స్టేషన్లలో మాస్క్‌ ధరించేలా, సోషల్‌ డిస్టెన్స్‌ తదితర కరోనా భద్రతా నియమాలు పాటించేలా ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ఫ్లాట్‌ఫారాలు, ఫ్లోర్‌పై పోస్టర్లు, స్టికర్లు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై మెట్రోస్టేషన్లలో ఉమ్మితే రూ.200 వరకు జరిమానా విధించనున్నారు. ఎక్కువ సార్లు చేస్తే జరిమానా మరింత పెంచనున్నారు.